Wednesday, January 26, 2011

నా నువ్వని .. నీ నేనని





ఊహలకు ఊపిరినిచ్చే వరము నీవని

ఊపిరికి వరములనిచ్చే ఊహ నీదని..


ఆశలకు ఆయువు పెంచిన అడుగు నీదని

అడుగులకు ఆయువునిచ్చిన ఆశ నీవని..


శ్వాసకే సరిగమలిచ్చిన స్వరము నీవని

సరిగమలకు స్వరములిచిన శ్వాస నీవని..


చూపులకు వెలుగుని పంచె మెరుపు నీవని

మెరుపులకు వెలుగులనిచ్చే చూపు నీదని..


మౌనమును మాటగ మార్చే మమత నీదని

మాటలకు మమతనిచ్చిన మౌనం నీవని.


తలపుల దాహానికి తొలకరి నువ్వని

తొలకరి తలపుల దాహం నువ్వని..



తళుకుల తారక నీ నవ్వని .. మెరుపుల మాలిక నా నువ్వని ..



Tuesday, January 18, 2011

అలరించిన విరిబాలకు విన్నవించనీ ..
కనిపించిన కళ్యాణికి కలను తెలుపనీ..
కదిలొచ్చిన కన్యామణి కనుల ఎదుటనే ..
కమనీయపు భావాలని కధగా మలచనీ..
చివురాశల గంధానికి చిరకాలపు బంధమవమనీ..
చిగురించిన ప్రాయానికి సిరిగంధపు నీడనిమ్మనీ..

నేను
.
అంతులేని ఆలోచనల ఆకారం నేను ..
అలుపులేని అన్వేషణల చకోరం నేను ..

కార్తీక పున్నమి లో వెన్నెల శీతలం నేను ..
మేఘబంధం లో మెరుపుల ఉష్ణం నేను ..

ఆనందపు ఆర్ద్రతలో ఆదమరచి నిదురించిన సత్యం నేను ..
ఆవేదనల ఉధృతి లో ఘనీభవించిన కన్నీటి స్వప్నం నేను..

వెన్నెల వర్షం లో మత్తుగా తూగుతున్న కలను నేను ..
మంచు వర్షపు చినుకుల మాటున మండుతున్న జ్వాలను నేను

వేయి పౌర్ణమిల వెలుగు నేను .. కోటి తారల తళుకు నేను
విశ్వాంతరాళపు నిశీధిలో వేకువలో వెలగలేని చీకటి చిత్రం నేను ..

చలించే కాలాన్ని నేను .. జ్వలించే వేగాన్ని నేను..
ఆనందపు అధ్బుతం నేను .. ఆశ్చర్యపు అనుభూతి నేను..
పూర్వపరముల నిమిత్తం లేని అపూర్వం నేను .. అనంతం నేను

కర్మ ఫలము తెలిసిన సందేశం నేను..
జగతి మర్మమెరుగని సందేహం నేను..


.
_____సమస్తం నేను .. సమాప్తం నేను____

Saturday, January 8, 2011


నిదురనదిలో నావికుడినై కలల లోకం చేరబోయే తలపు నాది ..
చివురు యదలో సుడులు రేపగ పడక సైతం చేరనివ్వని వలపు నీది ..
కలలు పంచగ చేరవచ్చిన కళవు నీవనీ ..
నమ్మవచ్చిన నా మదినైనా నను ఏమార్చనీ ..
కలత ఒడిలో క్షణ కాలమైనా నను నింనీ..
కడలి తడిలో గాలినైనా మదికి జోలపాడనీ ..
గుండె గదిలో గాయమికనైనా ఆరిపోనీ..

విరహాల వరదలలో నా ఊపిరాడదు ..
సందేహాల పరదాలలో నీ చూపు సాగదు..
కలవరం తో నా మది కలత చెందడమే కాని ..
నా కల వరమై నా చెంత చేరదు..

బండరాతి కొండవు నీవే మనసా ..
యదలో మంట నేను ఆర్పలేను బహుశా..
వెల్లువైన నా ఆనందం వెన్నెలైనప్పుడు .. పంచడానికి పచ్చని అడివి దొరికింది ..
నా ఆశల ఊపిరి తడి మేఘమైనప్పుడు .. కురిపించమని కడలి కదిలింది ..
గుండె కరిగి నీరవుతుంటే .. ఎదురు చూపులకు ఎడారి పలికింది ..
నిరాశ లో నిలువలేక నిదుర రాని నేను .. నింగికెగసి పాటనై పల్లవిస్తుంటే ..
.
.
నిశీధి లో నా స్వరం నివేదిస్తుంది..... నను వేధిస్తుంది ...

యుగాల నా అన్వేషణ నీ ఆసరా తో అనుభూతిగా మారగా ..

క్షణం నువ్వు నా మదిలో పొదిగిన అక్షరాలు ఆనందపు అక్షయాలు కాగా ..

చెదిరిపోకు స్వప్నమా .. కరిగిపోకు కాలమా..

నిదురలో నా కల


నిశ్సబ్ద రాతిరి లో నా పయనం సాగుతుంది ..

నిశీధి నీడలలో నా నయనం శోధిస్తుంది ..

.
చిత్రమేమిటో..

.
నల్లని నీ కాటుక లో నిశీధి కరుగుతుంది ..

చల్లని నీ చూపులతో వెన్నెల కురుస్తుంది ..

.
కలల లోగిలి లో ప్రేమకి ప్రాణమొస్తుంది ..

ప్రాయం పరవశిస్తుంది .. ప్రణయం పల్లవిస్తుంది..

.
అంతలోనే..
.
గాయం గుర్తుకొస్తుంది ..గానం మౌనమవుతుంది

మౌనరాగం మదికి జోల పాడుతుంది ..

కల నిదురిస్తుంది ..